ప్రారంభోత్సవానికి ముస్తాబైన న్యూ కలెక్టరేట్
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి, కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్, సెప్టెంబర్ 04 : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) ప్రారంభోత్సవ సంరంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కరకమలములచే ఈ నెల 05వ తేదీన న్యూ కలెక్టరేట్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు పర్యవేక్షించారు. సీ ఎం ఓ కార్యాలయం నుండి వచ్చిన సెక్యూరిటీ విభాగం అధికారులతో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్ల గురించి, న్యూ కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్ల గురించి చర్చించారు. కలెక్టరేట్ లోని అన్ని విభాగాలను సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఏ చిన్న పొరపాటుకు సైతం ఆస్కారం లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అన్నారు. సీఎం హాజరైన సమయంలో నిర్దేశిత ప్రణాళికను అనుసరిస్తూ సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించాలన్నారు. ఎవరు కూడా అనవసర తాపత్రయం ప్రదర్శించకుండా క్రమశిక్షణతో మెలగాలని, బాధ్యతలు కేటాయించిన ప్రాంతంలోనే ఉండాలన్నారు. పరస్పర సమన్వయంతో పని చేస్తూ సీఎం పర్యటన సజావుగా జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ దీపాల వెలుగులు... పరిమళభరిత పూల సోయగం
కాగా, ప్రారంభోత్సవానికి ముస్తాబైన నిజామాబాదు న్యూ కలెక్టరేట్ భవన సముదాయం సరికొత్త అందాలతో కళకళలాడుతోంది. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో తళుకులీనిన కొత్త కలెక్టరేట్ కు పరిమళభరిత పూల సోయగం మరింత అందాన్ని సంతరింపజేసింది. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కొలువుదీరిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణ అంతా ఎటుచూసినా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపింపజేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఈ నెల 05 న ప్రారంభోత్సవ కార్యక్రమం తలపెట్టిన సందర్భంగా న్యూ కలెక్టరేట్ ను అడుగడుగునా అందమైన పూలు, వెలుగులు విరజిమ్మే విద్యుత్ దీపాలతో మరింత సుందరంగా ముస్తాబు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు యావత్తు ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన మరుక్షణం నుండే ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ న్యూ కలెక్టరేట్ ను అందంగా, ఆకర్షణీయంగా ముస్తాబు చేయించారు. తుది ఏర్పాట్లలోనూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు కూడా క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షణ జరిపారు.
No comments:
Post a Comment